కాపు సమాజానికి పవన్ కళ్యాణ్ ఆశాకిరణం..

  • వైసీపీ నేతల వ్యాఖ్యలు ఖండనీయం
  • పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు

ఆంధ్రప్రభ, విజయవాడ : రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాల నేపథ్యంలో విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు తీవ్రంగా స్పందించారు.

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపుల ఆత్మీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ సమయంలో మౌనంగా ఉన్న కాపు నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం విడ్డూరమని ప్రశ్నించారు.

కాపు సమాజానికి జరిగిన నష్టాలకు ప్రధాన బాధ్యత వైఎస్సార్సీపీదేనని ఆరోపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడంతో పాటు 18 అవార్డులు సాధించడం ఆయన పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని, అలాంటి నాయకత్వంలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని అన్నారు.

అంబటి రాంబాబు, పేర్ని నాని తదితర వైఎస్సార్సీపీ నేతలు పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే జనసేన శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం కాపు సమాజానికే కాకుండా బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న నాయకుడని అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు.

కాపు సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, రాష్ట్రంలోని అధిక శాతం కాపు కులస్తులు పవన్ కళ్యాణ్‌కు అండగా ఉన్నారని చెప్పారు. కాపు సమాజ గుండెల్లో పవన్ కళ్యాణ్ విశ్వాసానికి, భరోసాకు ప్రతీకగా నిలిచారని వ్యాఖ్యానించారు.