Ayodhya Ram Mandir విరాళాల కుంభకోణం..
- రూ.7.5 కోట్ల విరాళాల మాయంపై దర్యాప్తు..
- మందిర సిబ్బందితో సహా 8 మందిపై కేసు
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిర్యాదు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిఫారసుల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మందిర సిబ్బందితో సహా మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. వారిలో పలువురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం, హుండీల్లో వచ్చిన నగదును లెక్కించే బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు సిబ్బందే విరాళాల నగదును దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నగదు అక్రమంగా మళ్లిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం. దీంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది.
ఈ కేసులో అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, రామశంకర్ మిశ్రా, రామశంకర్ యాదవ్ (టిన్ను యాదవ్), మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, కరుణేష్ పాండేలను నిందితులుగా చేర్చారు. ప్రధాన నిందితులైన లవ్కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రాలతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రామశంకర్ యాదవ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్కు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.7 నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల నగదు మాయమైనట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీయడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
సిట్ ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ కేసు అయోధ్యలోని రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో నమోదై, దర్యాప్తు కొనసాగుతోంది.
