Women’s T20 WC -2026 | చక్రం తిప్పుతున్న శ్రీ చరణి..
- ప్రపంచకప్‌లో వికెట్ల రాణిగా తెలుగు అమ్మాయి
- నాలుగు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు..
- అగ్రస్థానంలో భారత స్పిన్నర్ శ్రీ చరణి
- ప్రత్యర్థుల కంటే నాలుగు వికెట్లు ముందంజ..
- ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ రేసులోనూ ఫేవరెట్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్-2026లో తెలుగు బిడ్డ… భారత యువ స్పిన్నర్, శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచింది.
ఇక టోర్నమెంట్‌లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్లు హేలీ మాథ్యూస్, ఆలియా అలీన్, అలాగే పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తలో 8 వికెట్లు సాధించారు. అయితే, వారందరితో పోలిస్తే శ్రీ చరణి నాలుగు వికెట్లు ఎక్కువ తీసి… టోర్నమెంట్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
- శ్రీ చరణి – భారత్ – 12 వికెట్లు (5.31 ఎకానమీ రేట్)
- సోఫీ ఎక్లెస్టోన్ – ఇంగ్లండ్ – 8 వికెట్లు (5.87 ఎకానమీ రేట్)
- హేలీ మాథ్యూస్ – వెస్టిండీస్ – 8 వికెట్లు (6.06 ఎకానమీ రేట్)
- ఆలియా అలీన్ – వెస్టిండీస్ – 8 వికెట్లు (6.66 ఎకానమీ రేట్)
- ఫాతిమా సనా – పాకిస్థాన్ – 8 వికెట్లు (7.55 ఎకానమీ రేట్)
ఈ టోర్నమెంట్‌లో శ్రీ చరణి బెస్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కీలక సమయాల్లో వికెట్లు సాధిస్తూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఎకానమీ రేట్ కేవలం 5.31 మాత్రమే ఉండటం ఆమె బౌలింగ్‌లోని కట్టుదిట్టతకు నిదర్శనం. వికెట్లు తీయడమే కాకుండా పరుగులను నియంత్రిస్తూ ప్రత్యర్థిపై నిరంతరం ఒత్తిడి పెంచుతోంది.
భారత జట్టు విజయాల్లో శ్రీ చరణి ప్రధాన ఆయుధంగా మారింది. పవర్‌ప్లేలో వికెట్లు తీయడం నుంచి మిడిల్ ఓవర్లలో కీలక భాగస్వామ్యాలను విచ్ఛిన్నం చేయడం వరకు… ప్రతి మ్యాచ్‌లో తన ముద్ర వేస్తోంది. ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తూ భారత్‌కు ఎన్నో కీలక విజయాలను అందించింది.
టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో శ్రీ చరణి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు రేసులోనూ బలమైన పోటీదారుగా నిలిచింది. ఇదే జోరు కొనసాగితే మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశముంది.
ప్రపంచకప్ టైటిల్ లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత జట్టుకు శ్రీ చరణి బౌలింగ్ అతిపెద్ద బలంగా మారింది. ప్రస్తుతం వికెట్ల పట్టికలో ఆమెదే సంపూర్ణ ఆధిపత్యం కనిపిప్తెంది.
