Women’s T20 WC 2026 | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం..
- షెఫాలీ మెరుపు అర్ధశతకం..
- జెమీమా కీలక ఇన్నింగ్స్..
- 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ కీలక విజయాన్ని నమోదు చేసింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెణుకా సింగ్ ఠాకూర్ ఆరంభంలోనే దిలారా అక్తర్ (4)ను ఔట్ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. అనంతరం జువైరియా ఫెర్దౌస్ (33), శోభనా మోస్తరీ (22) భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ కోలుకునే ప్రయత్నం చేసింది. పవర్‌ప్లేలో భారత ఫీల్డర్లు పలు క్యాచ్‌లు వదిలేయడంతో ప్రత్యర్థికి కొంత ఊరట లభించింది.
మిడిల్ ఓవర్లలో నందిని శర్మ ఫెర్దౌస్‌ను పెవిలియన్‌కు పంపడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. నిగర్ సుల్తానా జోటి 32 పరుగులతో రాణించినా, భారత బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది.
137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షెఫాలీ వర్మ దూకుడైన ఆరంభం అందించింది. స్మృతి మంధాన కేవలం 8 పరుగులకే వెనుదిరిగినా, షెఫాలీ మాత్రం బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఆరంభంలో లభించిన క్యాచ్ అవకాశాన్ని ప్రత్యర్థి జట్టు చేజార్చుకోవడంతో షెఫాలీ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన ఆమె 34 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది.
యాస్తిక భాటియా 23 పరుగులు చేసి అవుట్ కాగా… రిచా ఘోష్‌ను ప్రమోట్ చేసిన భారత్ వ్యూహం ఫలించలేదు. ఆమె 10 పరుగులకే వెనుదిరిగింది. దీంతో చివరి ఆరు ఓవర్లలో భారత్ విజయానికి 33 పరుగులు అవసరమయ్యాయి.
ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ వేగంగా ఆడి నాలుగు అద్భుతమైన బౌండరీలతో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. 15 బంతుల్లో 26 పరుగులు చేసి అవుటైనప్పటికీ తన పని పూర్తి చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13 నాటౌట్), దీప్తి శర్మ (5 నాటౌట్) చివరి వరకు నిలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ టోర్నీలో కీలక రెండు పాయింట్లు సాధించడంతో పాటు సెమీఫైనల్ రేసులో తన అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది.
