Amrit Bharat Station Scheme | రూ.2,018 కోట్లతో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి
Amrit Bharat Station Scheme | రూ.2,018 కోట్లతో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి
Amrit Bharat Station Scheme | సికింద్రాబాద్ జంక్షన్ అత్యాధునిక ట్రాన్సిట్ హబ్‌గా రూపాంతరం
దివ్యాంగులకు అనుకూలంగా ఆధునిక సదుపాయాలు
చర్లపల్లి కొత్త టెర్మినల్‌గా కీలక కేంద్రం
Amrit Bharat Station Scheme | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రైల్వే రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లు ప్రయాణ కేంద్రాలుగానే కాకుండా పూర్తిస్థాయి సౌకర్య కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.
రాష్ట్రంలో నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్లను ఇప్పటి వరకు రైల్వే శాఖ మరమ్మతులు చేస్తూ వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) కింద రూ.2,018.91 కోట్లను మంజూరు చేసింది.
ఈ నిధులతో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు, మెరుగైన మౌలిక వసతులు, స్టేషన్ భవనాల అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, పార్కింగ్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.714.73 కోట్లు, హైదరాబాద్ స్టేషన్‌కు రూ.327.27 కోట్లు కేటాయించారు. నిజామాబాద్‌కు రూ.58.37 కోట్లు, గద్వాల్‌కు రూ.42.82 కోట్లు, కామారెడ్డికి రూ.39.84 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.39.82 కోట్లు మంజూరయ్యాయి.
మిర్యాలగూడ, నల్గొండ, కాజీపేట్, జనగామ, యాదాద్రి, రామగుండం, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, వరంగల్, లింగంపల్లి, భద్రాచలం రోడ్, జహీరాబాద్, తాండూర్, మల్కాజిగిరి, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, మంచిర్యాల, పెద్దపల్లి, వికారాబాద్, బేగంపేట్ తదితర స్టేషన్లు కూడా ఈ పథకం కింద అభివృద్ధి చెందనున్నాయి. అవసరాన్ని బట్టి రైల్వే స్టేషన్లకు రెండో ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేసే దిశగా రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది.
దివ్యాంగ్‌జన్ ఫ్రెండ్లీ సౌకర్యాలు
పార్కింగ్ కోసం ఉత్తరం వైపున ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. దక్షిణం వైపున అండర్‌గ్రౌండ్ డ్రాప్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల బయట ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. మొత్తం స్టేషన్‌ను పైకప్పుతో కవర్ చేయడం వల్ల వర్షం, ఎండ వంటి వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది. పర్యావరణానికి అనుకూలంగా కూడా ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా స్వంతంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 500 కిలోలీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్ ద్వారా నీటిని మళ్లీ వినియోగిస్తారు (వాటర్ రీసైక్లింగ్). వర్షపు నీటిని సేకరించేందుకు ప్రత్యేక రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తున్నారు.
సికింద్రాబాద్ జంక్షన్ కేంద్రంగా… 2 లక్షల మంది ప్రయాణికులకు సేవలు
సికింద్రాబాద్ జంక్షన్ పెద్ద మార్పు దిశగా వెళ్తోంది. రోజుకు 2 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఇప్పుడు దీన్ని అత్యాధునిక ట్రాన్సిట్ హబ్‌గా మారుస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.714 కోట్లు. ముఖ్య విషయం ఏమిటంటే రైలు సేవలకు అంతరాయం లేకుండా పనులు కొనసాగిస్తున్నారు. ఈ స్టేషన్‌లో పెద్ద విశాల గగన ఆవరణ (స్కై కాన్‌కోర్స్) నిర్మిస్తున్నారు. ఇది ట్రాక్‌లపై సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
ప్రయాణికులు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. రెస్టారెంట్లు, షాపింగ్ సదుపాయాలు కూడా ఉంటాయి. రైలు వచ్చినప్పుడు నేరుగా లిఫ్ట్ ద్వారా ప్లాట్‌ఫారంకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మెట్లపై భారీ సామాను మోయాల్సిన అవసరం తగ్గుతుంది. 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, కదిలే నడవా మార్గాలు (మూవింగ్ వాక్‌వేలు) ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త టెర్మినల్‌గా… చర్లపల్లి స్టేషన్!
చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా కొత్త టెర్మినల్‌గా అభివృద్ధి చేశారు. దీనికి రూ.420 కోట్లు ఖర్చు చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు దీన్ని కీలక కేంద్రంగా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి భవిష్యత్తులో రైలు ప్రయాణాన్ని అవసరంతోపాటు ఆహ్లాదకరంగా మలిచే దిశగా సాగుతోంది.
