APL | కాకినాడ కింగ్స్ గ్రాండ్ విక్టరీ

  • లో స్కోరింగ్ థ్రిల్లర్‌..
  • తుంగభద్ర వారియర్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హరి శంకర్ రెడ్డి

ఆంధ్రప్రభ, విజయవాడ: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 సీజన్-5లో మంగళగిరి వేదికగా జరిగిన రెండో రోజు రెండో మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ పోరులో కాకినాడ కింగ్స్ 4 వికెట్ల తేడాతో తుంగభద్ర వారియర్స్‌పై విజయం సాధించింది.

టాస్ గెలిచిన తుంగభద్ర వారియర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, కాకినాడ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. పవర్‌ప్లేలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన తుంగభద్ర జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. అనంతరం సౌరభ్ కుమార్ 19 బంతుల్లో 33 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్స్), సాత్విక్ 18 బంతుల్లో 31 పరుగులు (1 ఫోర్, 3 సిక్సర్లు)తో పోరాడినా, జట్టు 19.4 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది.

కాకినాడ బౌలర్లలో హరి శంకర్ రెడ్డి మూడు వికెట్లతో చెలరేగగా, ఆంజనేయులు, సాయి తేజ చెరో రెండు వికెట్లు తీశారు.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్‌కు ఓపెనర్లు దూకుడైన ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి 60కుపైగా పరుగులు నమోదు చేసి విజయానికి గట్టి పునాది వేశారు. అయితే వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. చివరి ఓవర్ల వరకు ఫలితం తేలకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కాకినాడ తరఫున అభిషేక్ రెడ్డి 38 బంతుల్లో 50 పరుగులు (6 ఫోర్లు) చేసి అర్ధశతకంతో రాణించగా, అర్జున్ టెండూల్కర్ 21 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కాకినాడ కింగ్స్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

తుంగభద్ర వారియర్స్ బౌలర్లలో ఐదుగురు చెరో వికెట్ తీశారు. మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన హరి శంకర్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.