Venezuela Twin earthquakes | 164 మందికి చేరిన మృతుల సంఖ్య..
- 970 మందికిపైగా గాయాలు
- నిమిషం వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు
- అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం..
- సహాయానికి ముందుకొచ్చిన భారత్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాను… వరుసగా సంభవించిన రెండు భూకంపాలు అతలాకుతలం చేశాయి. నిమిషం వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపాల ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తులో మృతి చెందిన వారి సంఖ్య 164 మందికి చేరగా.. 970 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న ఆందోళనతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
తొలి భూకంపం 22 కిలోమీటర్ల లోతులో వెనెజువెలా కరేబియన్ తీరంలోని మొరోన్‌కు పశ్చిమంగా సంభవించినట్టు అమెరికా భూగర్భ సర్వే (USGS) వెల్లడించింది. కేవలం నిమిషం వ్యవధిలోనే అదే ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది.
భూకంపాల కారణంగా రాజధాని కారకాస్‌తో పాటు లా గ్వైరా, మిరాండా, అరాగ్వా తదితర ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. అనేక భవనాలు నేలమట్టమ్వగా, ప్రధాన విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినడంతో కార్యకలాపాలను నిలిపివేశారు. మెట్రో, రైలు సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక బృందాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకృతి విపత్తుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైతే వెనెజువెలాకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ విపత్తు తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించిందని అమెరికా భూగర్భ సర్వే ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి.
