Nbk-112-Movie : చిత్ర పరిశ్రమకు ఏపీలో పెద్దపీట Andhra Prabha Cine News
Nbk-112-Movie : చిత్ర పరిశ్రమకు ఏపీలో పెద్దపీట Andhra Prabha Cine News
- ప్రజా రాజధానిలో ‘NBK 112’ చిత్రం
- ముహూర్తపు షాట్‌కు మంత్రులు లోకేష్, దుర్గేష్ క్లాప్
- ఏపీలో చిత్ర పరిశ్రమ సుస్థిరతకు ఇదే పునాది
- ఏపీలో అన్ని సదుపాయాలు కల్పిస్తాం
- మంత్రి దుర్గేష్ వెల్లడి
( ఆంధ్రప్రభ, అమరావతి)

పద్మభూషణ్,ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ 112వ చిత్రం ప్రజా రాజధాని అమరావతిలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన ‘NBK 112’ చిత్రం ముహూర్తపు వేడుకకు ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి నారాలోకేష్ లు హాజరయ్యారు.శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమాల అనంతరం, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ లు స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించారు. ముహూర్తపు షాట్‌కు మంత్రులు క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్చాన్ చేయగా.. మంత్రి దుర్గేష్ ‘యాక్షన్’ చెప్పారు. ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణకు, చిత్ర బృందానికి మంత్రులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఏపీలో స్టూడియోల నిర్మాణం, రీ-రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో బాలకృష్ణ ప్రోత్సాహంతో ఇటీవలే భరత్ భూషణ్ ఛైర్మన్ గా ఎఫ్ డీసీ కార్యవర్గం ఏర్పాటు చేశామన్నారు. ఏపీ రాజధాని వేదికగా ఒక పెద్ద సినిమా గ్రాండ్ గా లాంఛ్ అవ్వడం, అధిక భాగం షూటింగ్ ఏపీలో చిత్రీకరిస్తామనడం శుభపరిణామమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడేందుకు ఇదొక బలమైన పునాది అన్నారు. చెరుకూరి సుధాకర్, మిక్కిలినేని సుధాకర్ ల నిర్మాణ సారథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో సాంకేతిక నిపుణుల సమక్షంలో అద్భుతమైన కథతో, నటవర్గంతో తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ ‘NBK 112’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఏపీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్లూనుకోవాలని, గతంలో ఘన చరిత్ర కలిగిన విజయవాడలో మళ్లీ ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో నవ్యాంధ్రలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సినిమాటోగ్రఫీ మంత్రిగా సర్వశక్తులూ ఒడ్డుతానన్నారు.
