11 ఏళ్ల తర్వాత సెషెల్స్‌లో మోదీ పర్యటన..

  • ఈ నెల 27 నుంచి రెండు రోజుల అధికారిక పర్యటన
  • సెషెల్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనున్న ప్రధాని
  • హిందూ మహాసముద్ర భద్రత, ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు

ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి రెండు రోజుల పాటు సెషెల్స్‌లో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. సెషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ సెషెల్స్‌ను సందర్శించనుండటం విశేషం. సెషెల్స్ స్వాతంత్ర్యానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ప్రధాని మోదీ చివరిసారిగా 2015లో సెషెల్స్‌ను సందర్శించారు. ఈసారి జరిగే వేడుకల్లో భారత రక్షణ దళాల బృందంతో పాటు భారత నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ నౌకలు కూడా పాల్గొననున్నాయి.

పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సెషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకోనున్నారు.

ప్రధాని మోదీ సెషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనుండగా, అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రవాసులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

భారత్-సెషెల్స్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలక సముద్ర పొరుగు దేశమైన సెషెల్స్‌కు భారత్ ప్రకటించిన ‘మహాసాగర్ (MAHASAGAR – Mutual and Holistic Advancement for Security and Growth Across Regions)’ దృష్టిలో ప్రత్యేక స్థానం ఉంది. అలాగే గ్లోబల్ సౌత్ దేశాలకు మద్దతు ఇవ్వాలన్న భారత నిబద్ధతలో కూడా సెషెల్స్ కీలక భాగస్వామిగా ఉంది.

ఈ పర్యటన ద్వారా భారత్-సెషెల్స్ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధం మరింత బలపడటంతో పాటు రక్షణ, సముద్ర భద్రత, ఆర్థిక, అభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తరించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.