కమర్షియల్ ఎల్పీజీపై ఆంక్షలు ఎత్తివేత..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడంతో దేశీయ వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కమర్షియల్ ఎల్పీజీ వినియోగంపై గతంలో విధించిన పరిమితులను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో గ్యాస్ దిగుమతులు సాధారణ స్థితికి చేరుకున్నాయని వెల్లడించింది.

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాలను ఇప్పటికే 50 శాతం మేర పునరుద్ధరించిన ప్రభుత్వం, ఇప్పుడు పూర్తిస్థాయిలో సరఫరాలను పునఃప్రారంభిస్తోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తరహా పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలకు ఎల్పీజీ కొరత సమస్య తీరనుంది.

సంక్షోభ సమయంలో గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎల్పీజీ తయారీకి అవసరమైన సీ3-సీ4 గ్యాస్ వనరులను ఇతర రంగాలకు మళ్లించకుండా పూర్తిగా వంటగ్యాస్ సిలిండర్ల ఉత్పత్తికే కేటాయించింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడటంతో ఆ పరిమితులను సడలించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో సరఫరా సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, దేశీయంగా రోజుకు కనీసం 40 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే దేశీయ పెట్రోకెమికల్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి సీ3–సీ4 గ్యాస్ కేటాయింపులను కూడా పెంచనున్నట్లు తెలిపింది.

మరోవైపు, పర్యావరణహిత పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) నెట్‌వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే పీఎన్‌జీ వినియోగిస్తున్న వాణిజ్య సంస్థలు అదే విధానంలో కొనసాగుతాయని, కొత్తగా నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే ప్రాంతాల్లో కూడా వినియోగదారులను దశలవారీగా పీఎన్‌జీ కనెక్షన్ల వైపు మళ్లించే ప్రణాళిక అమలు చేయనున్నట్లు వెల్లడించింది.