AI Education | 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఏఐ పాఠాలు

AI Education | 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఏఐ పాఠాలు

AI Education | ప్రైవేటు పాఠశాలల్లోనూ ఎఫ్‌ఎల్‌ఎన్ తప్పనిసరి
విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
వెనుకబడిన విద్యార్థులకు అభ్యసన బలోపేత కార్యక్రమం

AI Education | హైదరాబాద్, ఆంధ్రప్రభ: మారుతున్న కాలం, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం పై తరగతులకే పరిమితం చేయకుండా, ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు చేరువ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ) పాఠాలను బాల్యం నుంచే బోధించేలా సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ ఈ భారీ సంస్కరణలను చేపట్టింది. ఇక ఏఐ టూల్స్‌తో స్మార్ట్ బోధన చేయనున్నారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు వారానికి 80 నిమిషాలపాటు ఏఐ పాఠాలను బోధించనున్నారు. సాంకేతికత గురించి చెప్పడమే కాకుండా, సబ్జెక్టుల్లో పట్టు సాధించేందుకు ఈ టూల్స్‌ను ఉపయోగించనున్నారు.

గణితాన్ని వారానికి రెండు సార్లు, ఒక్కోసారి 20 నిమిషాలపాటు ఏఐ సాఫ్ట్‌వేర్ సాయంతో బోధిస్తారు. దీనివల్ల విద్యార్థులకు గణితంపై భయం పోయి, ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు మిగిలిన 40 నిమిషాలను కేటాయిస్తారు. ఏఐ ఆధారిత ఆడియో, విజువల్ టూల్స్ ద్వారా భాషపై పట్టు సాధించేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రైవేటు పాఠశాలల్లోనూ ఎఫ్‌ఎల్‌ఎన్ తప్పనిసరి

ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని ఇకపై అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ విధిగా అమలు చేయాలని విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఈ విధానాన్ని అమలు చేయడం తప్పనిసరి. విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

నాలుగేళ్లుగా విద్యాశాఖ చేపట్టిన నిరంతర ప్రణాళికల వల్ల జాతీయ స్థాయి సర్వేల్లో రాష్ట్ర విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. జాతీయ ర్యాంకింగ్స్‌లో గతంలో 36వ స్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం 26వ స్థానానికి చేరుకుంది. ఈ వృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, దేశంలోనే టాప్-10 రాష్ట్రాల జాబితాలో చేరడమే లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సమానమైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

వెనుకబడిన విద్యార్థులకు అభ్యసన బలోపేతం

సామర్థ్యం తక్కువగా ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు అభ్యసన బలోపేతం (లెర్నింగ్ ఎన్‌హాన్స్‌మెంట్) పీరియడ్‌ను కేటాయించారు. ఈ సమయంలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాగే తరగతి గదిలో వెనుకబడిన పిల్లల కోసం ఉపాధ్యాయ మద్దతు బృందాలు (టీచర్ సపోర్ట్ గ్రూపులు) ఏర్పాటు చేసి, అందరూ కనీస సామర్థ్యాలు సాధించేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.

విద్యార్థుల పురోగతిని పరిశీలించేందుకు ఏటా మూడు సార్లు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జులైలో విద్యార్థి స్థాయిని అంచనా వేసేందుకు ప్రాథమిక పరీక్ష (బేస్‌లైన్ టెస్ట్), నవంబరులో మధ్యంతర పరీక్షలు (మిడ్‌లైన్), మార్చిలో వార్షిక ఫలితాల అంచనా కోసం తుది దశ పరీక్షలు (ఎండ్‌లైన్) నిర్వహించనున్నారు. ఈ పరీక్షల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలి. దీనివల్ల రాష్ట్రస్థాయి అధికారులకు కూడా ఏ పాఠశాలలో విద్యార్థులు ఎలా రాణిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.