Mule scam | దేశవ్యాప్తంగా అలర్ట్….
Mule scam | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణలో కొత్త తరహా స్కామ్ వెలుగులోకి వచ్చింది. నమ్మించి, అదే నమ్మకంతో మోసం చేసే ఈ విధానాన్ని ‘మ్యూల్ స్కామ్’గా పిలుస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌లో బయటపడిన ఈ ఘటన దేశవ్యాప్తంగా అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేసింది.
జిల్లాలోని RBL బ్యాంక్‌కు సంబంధించిన మ్యూల్ అకౌంట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరీంనగర్ బ్రాంచ్‌లో 8 మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లకు సహకరించారనే ఆరోపణలపై పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు.

ఈ ఖాతాల ప్రారంభంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అకౌంట్ల ద్వారా రూ.100 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సైబర్ మోసాల ద్వారా వచ్చిన ఈ డబ్బు చైనా వంటి దేశాలకు హవాలా మార్గంలో మళ్లించబడిన అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు 24 మంది నిందితులను గుర్తించినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఇతర బ్యాంకుల్లో కూడా ఇలాంటి మ్యూల్ ఖాతాలు ఉన్నాయా అన్న దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.
ఇక దేశవ్యాప్తంగా మ్యూల్ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచింది. తెలంగాణ పోలీసులు నిర్వహించిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’లో రాష్ట్రవ్యాప్తంగా 208 మందిని అరెస్ట్ చేశారు. సుమారు 1,888 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు.
ఈ చర్యల భాగంగా జగిత్యాల జిల్లాలోని కేడీసీసీ, గాయత్రి బ్యాంకుల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా కరీంనగర్ RBL బ్యాంక్ సిబ్బంది సహా మరికొందరు అరెస్ట్ కావడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అమాయకులు సైబర్ మోసాల బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.
ఇంతకీ ‘మనీ మ్యూల్ స్కామ్’ అంటే ఏమిటి?
సైబర్ నేరగాళ్లు దొంగిలించిన డబ్బును ఇతరుల బ్యాంక్ ఖాతాల ద్వారా బదిలీ చేయించి, ఆ వ్యక్తులను చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టే మోసపూరిత పద్ధతినే మ్యూల్ స్కామ్ అంటారు.
నకిలీ ఉద్యోగాలు, ప్రేమ వ్యవహారాలు వంటి మాయమాటలతో అమాయకులను ఆకర్షించి, వారి బ్యాంక్ ఖాతాలను వినియోగిస్తారు. ఒకవేళ ఈ వ్యవహారంలో చిక్కుకుంటే, సంబంధిత వ్యక్తులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అందువల్ల అపరిచితుల నుంచి వచ్చే డబ్బు బదిలీ అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, పిన్ నంబర్లు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని హెచ్చరిస్తున్నారు.
ఏదైనా మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేకపోతే www.cybercrime.gov.in
వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కంప్లయింట్ నమోదు చేయవచ్చు అని పోలీసులు సూచిస్తున్నారు.
