మండల స్థాయిలోనే ప్రజల సమస్యలకు పరిష్కారం..

  • ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీడీవో తేజ

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాడ్వాయి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఎంపీడీవో తేజ మాట్లాడుతూ.. గతంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రతి సోమవారం ములుగు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇకపై తాడ్వాయి మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే సంబంధిత అధికారులను కలిసి దరఖాస్తులు అందజేయవచ్చని చెప్పారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను స్వీకరించి, వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార మార్గం చూపించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.