మండల స్థాయిలో తొలిరోజు ప్రజావాణి
ప్రజల నుంచి విశేష స్పందన
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపించే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఎల్కతుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైంది.
తొలిరోజు ఎంపీడీవో విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ప్రజలు తమ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు నేరుగా వివరించే అవకాశం కల్పించడంతో ప్రజావాణికి మంచి స్పందన లభించింది. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో విజయ్‌కుమార్ ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన తెలిపారు.
ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
