సనత్‌నగర్ టిమ్స్ అందుబాటులోకి రావడంపై కేటీఆర్ హర్షం..
అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లను కూడా త్వరగా ప్రారంభించాలని డిమాండ్
1,000 పడకలు.. 300 ఐసీయూ బెడ్లు..
16 ఆపరేషన్ థియేటర్లతో సనత్‌నగర్ టిమ్స్
పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న కేటీఆర్..
గత ప్రభుత్వ ప్రణాళికలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రి ప్రారంభం నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. సనత్‌నగర్ టిమ్స్ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నాలుగు దిశల్లో టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించిందని తెలిపారు.
ఒకేచోట అత్యాధునిక వైద్య సదుపాయాలు
సనత్‌నగర్ టిమ్స్‌లో 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే, క్యాథ్‌ల్యాబ్‌లు, రేడియాలజీ, డయాలసిస్ వంటి విభాగాలు అందుబాటులో ఉండటం రోగులకు ఉపయోగకరమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు కూడా ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో సేవలందించే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాథమిక వైద్య సేవల కోసం 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు పెద్ద సంఖ్యలో పడకల సామర్థ్యంతో ఆసుపత్రుల ప్రణాళికలు రూపొందించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే లక్ష్యంతో 4 వేల పడకలు, ఆక్సిజన్ సౌకర్యాలతో 1,200 అత్యవసర పడకల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇవి పేద రోగులకు భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు.
అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లను ప్రారంభించాలని డిమాండ్
సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభమైన నేపథ్యంలో మిగిలిన అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రులను కూడా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని నిమ్స్ విస్తరణ పనులను కూడా వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేయాలని, పెండింగ్‌లో ఉన్న వైద్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేటీఆర్ సూచించారు.
