అనుమతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాల జోరు.. దేవరయంజాల్లో కోల్డ్ స్టోరేజ్ కలకలం
1500 గజాల్లో మూడు నెలలుగా నిర్మాణ పనులు
హెచ్ఎండీఏ నిబంధనలకు తూట్లు.. అధికారులపై ఆరోపణలు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందన్న విమర్శలు
మామూళ్ల మత్తులో టౌన్ ప్లానింగ్ విభాగం?
కలెక్టర్ స్పందిస్తేనే అక్రమానికి అడ్డుకట్ట
అక్రమాలకు.. కొందరు అవినీతి అధికారులు దాసోహం కావడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డే లేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.. కీసర సర్కిల్లోని దేవరయంజాల్ పట్టణ రెవెన్యూ పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులు మింగి.. చోద్యం చూస్తున్న కారణంగానే.. అనుమతులు లేకుండా 1500 గజాల్లో ఈ కోల్డ్ స్టోరేజ్ పనులు మూడు నెలలుగా రాత్రింబవళ్లు సాగుతున్నాయని.. స్థానికులు ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
నోటీసులు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్న అధికారులు.. అక్రమార్కులకు అండదండలను పుష్కలంగా అందిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండిపడుతుండగా.. అధికారుల జేబుల్లోకి మాత్రం భారీ మొత్తం చేరుతున్నట్లు తెలుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణానికి అడ్డుకట్ట వేయాలని.. ఆమ్యామ్యాలు పుచ్చుకొని అండగా నిలుస్తున్న అవినీతి అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
— ఆంధ్రప్రభ నిఘా విభాగం, హైదరాబాద్
అనుమతులకు విరుద్ధంగా.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, కీసర సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల జోరు ఆందోళన కలిగిస్తోంది. కీసర సర్కిల్ పరిధిలోని దేవరయంజాల్లో అక్రమంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. మూడు నెలలుగా 1500 గజాల్లో రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రభ నిఘా విభాగం, హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో అనుమతులు లేకుండానే భవన నిర్మాణ పనులు, గోదాముల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సర్కిల్లోని దేవరయంజాల్ పట్టణ రెవెన్యూ పరిధిలో ఎమ్మెస్సార్-ఎంఎల్ఆర్ కన్వెన్షన్ వెనుక భాగంలో సుమారు 1500 చదరపు గజాల స్థలంలో భారీ ఎత్తున కోల్డ్ స్టోరేజ్‌ను నిర్మాణం చేస్తున్నారు.
గత మూడు నెలలుగా రాత్రింబవళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయినా, టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలోతొక్కుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. నిర్మాణ పనులను అడ్డుకోవాలని స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు నెలలుగా పనులు.. అధికారులపై ప్రశ్నలు
దేవరయంజాల్ రెవెన్యూ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులు మూడు నెలలుగా కొనసాగుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణంపై స్థానికులు కొందరు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
వాస్తవానికి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టాలంటే హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాక, వివిధ విభాగాల నుంచి అనుమతులు పొందిన తరువాతనే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులు పొందే సమయంలో ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు, పన్నుల రూపంలో లక్షలాది రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
కానీ, దేవరయంజాల్ పట్టణ రెవెన్యూ పరిధిలో సుమారు 1500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న కోల్డ్ స్టోరేజ్‌కు ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయలకు గండికొట్టి కేవలం టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ నిర్మాణం కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి.
తద్వారా టౌన్ ప్లానింగ్ అధికారులకు పెద్దమొత్తంలో నిర్మాణదారుల నుంచి ముడుపులు అందాయని… ఈ కారణంగానే మూడు నెలలుగా అనుమతులు లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నా.. ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.
మామూళ్ల మత్తులో టౌన్ ప్లానింగ్ విభాగం..!
దేవరయంజాల్ పట్టణ రెవెన్యూ పరిధిలో అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు కొనసాగుతున్న కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు స్థానికులు బహిరంగంగానే పేర్కొంటున్నారు.
ఈ అనుమతులు లేని నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఫిర్యాదులు చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని.. తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంపై ఫిర్యాదులు చేస్తే నోటీసులు ఇస్తామంటూ.. చర్యలు తీసుకుంటామంటూనే ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
పేదవాడు చిన్నపాటి నిర్మాణం చేపట్టినా ఆఘమేఘాలమీద అక్కడకు చేరుకొని అనుమతులు లేవంటూ కూల్చివేతలు చేపట్టే అధికారులు.. నిబంధనలను తుంగలోతొక్కుతూ భారీ ఎత్తున నిర్మాణం అవుతున్న కోల్డ్ స్టోరేజ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంపై విచారణ జరపాలని.. తద్వారా నిర్మాణాలను కూల్చివేయడంతోపాటు.. యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ స్పందిస్తేనే అక్రమానికి అడ్డుకట్ట
దేవరయంజాల్ పట్టణ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి నిర్మితమవుతున్న కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంపై కలెక్టర్ దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మూడు నెలలుగా రాత్రింబవళ్లు అనుమతులు లేకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ సదరు నిర్మాణంపై విచారణ జరిపించి.. ప్రభుత్వ నిబంధనలు తుంగలోతొక్కిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతోపాటు.. అక్రమ నిర్మాణానికి సహకరించిన టౌన్ ప్లానింగ్, ఇతర విభాగాల అధికారులపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
