ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి
ప్రభుత్వం ఏర్పడి 30 నెలలైనా హామీలు అమలు కాలేదని విమర్శ..
పోలీసు, విద్యాశాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌
పోలీసు శాఖలో 20 వేలకు పైగా ఖాళీలు ఉంటే 7,437 పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆరోపణ..
కొన్ని కమిషనరేట్లకు పోస్టులు కేటాయించలేదని వ్యాఖ్య

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు తమను నమ్మాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలా కోరుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 30 నెలలు గడిచినా ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని ఆమె విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు 16 వేలని ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారని పేర్కొంటూ.. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే అణచివేతా?

ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి పోలీసులను పెట్టి అణచివేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

పోలీసు శాఖలో ఖాళీలపై ప్రశ్నలు

పోలీసు శాఖలో 20 వేలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని నాలుగు పోలీసు కమిషనరేట్లకు ఒక్క కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆయా ప్రాంతాల నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖాళీల సంఖ్యకు అనుగుణంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యాశాఖలోనూ భారీ ఖాళీలు

విద్యాశాఖలో 20 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా వెంటనే భర్తీ చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు కోరుతున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న యువత పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలు, ప్రత్యారోపణలకు ప్రాధాన్యం ఇవ్వడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు.

ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

పోలీసు శాఖలోని మొత్తం ఖాళీలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని, విద్యాశాఖలోని 20 వేలకు పైగా ఖాళీలను కూడా భర్తీ చేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. “విద్యార్థులు, నిరుద్యోగుల గురించి నిజంగా ప్రభుత్వం ఆలోచిస్తే.. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ గుర్తించి, భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి” అని ఆమె పేర్కొన్నారు. CURE పరిధిలోని జిల్లాలకు పోలీసు ఉద్యోగాల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ఎలా సరిచేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.