జర్నలిజానికి విజయవాడే పుట్టినిల్లు..

జర్నలిస్టుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకువెళ్తాం..
70 వసంతాల ఏపీయూఎడబ్ల్యూజే వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
విలువలతో కూడిన జర్నలిజాన్ని కాపాడుకోవాలి.. ఎమ్మెల్యే బోండా ఉమ
జర్నలిస్టులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి..
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలి
ఏపీయూడబ్ల్యూజే నేతలు..
అట్టహాసంగా ఏపీయూ డబల్యూజే 70 వసంత వేడుకలు..

విజయవాడ, ఆంధ్రప్రభ : జర్నలిజానికి పుట్టినిల్లు విజయవాడైనని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూఎడబ్ల్యూజే) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని గాంధీనగర్ లో ఉన్న ప్రెస్‌క్లబ్ వద్ద ఏపీయూఎడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ సభకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఇండియన్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ప్రతినిధి సిన్హా, సుబ్బారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీయూఎడబ్ల్యూజే 70 వసంతాల నూతన లోగో, సావనీర్‌ను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ ఆవిష్కరించారు.

జర్నలిజానికి విజయవాడే పుట్టినిల్లు…

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ.. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇటీవలే జరుపుకున్నామని, ఇప్పుడు 70 ఏళ్ల ఏపీయూఎడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జర్నలిజం పుట్టిందే విజయవాడ గడ్డపై అని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాలంలో విలువలతో కూడిన జర్నలిజం క్రమంగా తగ్గిపోతోందని అన్నారు.

పత్రికా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు తోడయ్యాయని, వార్తలను త్వరగా అందించాలనే క్రమంలో కొన్నిసార్లు అసత్యాలు ప్రచారంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. నిజం కంటే అబద్ధం వేగంగా వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అని అన్నారు. గతంలో ఒక వార్త రాసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకునేవారని, ఇప్పుడు ఆ విధానం తగ్గిపోయిందన్నారు.

ఒకప్పుడు ఉదయం ఐదు గంటలకే లేచి పత్రిక కోసం ఎదురుచూసేవాళ్లమని, డిజిటల్ యుగంలో అన్ని వార్తలు ఫోన్లలోనే అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. గతంలో రాజకీయ నాయకులు తమపై వార్త వస్తుందంటే భయపడేవారని, నాణ్యమైన వార్తలకు బదులుగా వివాదాలకు ప్రాధాన్యం పెరగడంతో ఆ పరిస్థితి మారిందన్నారు. జర్నలిస్టులు మంచి వార్తలు, వాస్తవాలను ప్రజలకు అందించాలని కోరారు. జర్నలిస్టులకు తాము ఎప్పుడూ గౌరవం ఇస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీడియాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.

జర్నలిజం సవాళ్లతో కూడుకున్న వృత్తి…

ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ.. జర్నలిజం అనేది అనేక సవాళ్లతో కూడుకున్న వృత్తి అని అన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేసేది జర్నలిస్టులేనని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో ఎవరు వేగంగా వార్తను అందిస్తే వారిదే ఆధిపత్యంగా మారుతోందన్నారు. ఒకప్పుడు పత్రిక చదివిన తర్వాతే దేశంలో ఏం జరుగుతుందో తెలిసేదని, ఇప్పుడు డిజిటల్ మీడియా విస్తరణతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.

తాము మాట్లాడకపోయినా కొన్ని సందర్భాల్లో తమపై వార్తలు వస్తున్నాయని అన్నారు. డిజిటల్ యుగంలో అసత్యాలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి నమోదు లేకుండానే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తూ, వారికి నచ్చిన విధంగా వార్తలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తారని తెలిపారు. జర్నలిస్టులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, తాను కలిసి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని, కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని బోండా ఉమ తెలిపారు.

జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాలు..

ఈ సందర్భంగా ఏపీయూఎడబ్ల్యూజే ప్రతినిధులు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమలకు వినతిపత్రాలు అందజేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యలు లేదా ప్రమాదాల్లో మరణించే జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, రైలు ప్రయాణాల్లో సబ్సిడీ కల్పించాలని, ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని, జర్నలిస్టులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలు జరిగేలా చూడాలని ఎంపీ, ఎమ్మెల్యేలను ఏపీయూఎడబ్ల్యూజే ప్రతినిధులు కోరారు.