కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై పొన్నం క్లారిటీ
కల్యాణ లక్ష్మి.. శాదీ ముబారక్‌పై హైకోర్టు స్టే
పథకాలను ఆపాలని కోర్టు ఆదేశించలేదు..
మధ్యంతర ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో లోపాలే ప్రస్తుత న్యాయపరమైన సమస్యలకు కారణమన్న మంత్రి
పేదల సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..
బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కల్యాణ లక్ష్మి, శాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ పథకాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పటివరకు జారీ చేసిన పలు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వం పేర్కొన్న వివరాల ప్రకారం.. డబ్ల్యూపీ నంబర్ 21732/2026లో ఆగస్టు 12న హైకోర్టు సెప్టెంబర్ 9 వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవిస్తూనే, పేదలకు నష్టం కలగకుండా న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తామని మంత్రి తెలిపారు.
బీఆర్‌ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్
కల్యాణ లక్ష్మి, శాదీ ముబారక్ పథకాల విషయంలో బీఆర్‌ఎస్ ‘మొసలి కన్నీరు’ కారుస్తూ నిరసనలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల లబ్ధిదారులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.
పథకాలను నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుని వాటిని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
పాత ఉత్తర్వుల్లో లోపాలే కారణమా?
కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే కొన్ని లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. 2014లో పథకాన్ని ప్రారంభించే సమయంలో నిబంధనలను సరైన రీతిలో రూపొందించి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్న లోపాలను సరిచేసి పథకం నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు ఉన్నందున, న్యాయపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.
అధికారుల తప్పిదాలపైనా విచారణ
కోర్టులో సమర్థవంతంగా కౌంటర్ దాఖలు చేయడంలో అధికారుల వైఫల్యమా? లేక ప్రభుత్వ న్యాయపరమైన వ్యవహారాలను పర్యవేక్షించే విభాగంలో లోపమా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. విచారణలో బాధ్యత ఎవరిదని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
16.78 లక్షల మందికి రూ.16,375 కోట్లకుపైగా ప్రయోజనం
ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. కల్యాణ లక్ష్మి, శాదీ ముబారక్ పథకాల ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.16,375.87 కోట్లు ఖర్చు చేసి 16,78,347 మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించినట్లు పేర్కొంది.
వర్గం ఖర్చు లబ్ధిదారులు
ఎస్సీ సంక్షేమం రూ.2,734.81 కోట్లు 2,73,164
ఎస్టీ సంక్షేమం రూ.1,801.48 కోట్లు 1,79,939
బీసీ సంక్షేమం రూ.7,803.05 కోట్లు 7,79,401
ఈబీసీ సంక్షేమం రూ.831.70 కోట్లు 83,074
మైనారిటీ సంక్షేమం రూ.3,204.83 కోట్లు 3,62,769
మొత్తం రూ.16,375.87 కోట్లు 16,78,347
ఈ పథకాలు 2014లో ప్రారంభమై, అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా విస్తరించాయని ప్రభుత్వం తెలిపింది.
పథకాలకు చట్టబద్ధతపై ప్రభుత్వం వాదన
కల్యాణ లక్ష్మి, శాదీ ముబారక్ పథకాలు ప్రత్యేక శాసనం ద్వారా రూపొందించిన పథకాలు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ద్వారా లభించే కార్యనిర్వాహక అధికారాల ఆధారంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రభుత్వం తన వాదనలో పేర్కొన్నట్లు సమాచారం.
పథకాల కోసం బడ్జెట్ కేటాయింపులు శాసనసభ ఆమోదానికి లోబడి ఉంటాయని, అర్హత, ఆదాయ పరిమితి, వయస్సు, ఆధార్, వివాహం తదితర అంశాలకు నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం వివరించింది. వధువు వివాహ సమయానికి 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండటం తప్పనిసరి కాగా, అర్హతలను సంబంధిత రెవెన్యూ అధికారులు పరిశీలించే విధానం ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజాధనాన్ని ఎలాంటి నియంత్రణ లేకుండా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు సరైనవి కావని ప్రభుత్వం వాదిస్తోంది.
సీఏజీ అభ్యంతరాలపై కూడా ప్రభుత్వం వివరణ
పథకాల అమలుపై కాగ్ నివేదికలో వ్యక్తమైన అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే అవి పథకాలు చట్టవిరుద్ధమని తేల్చిన తుది న్యాయ నిర్ణయాలు కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. పేద కుటుంబాల్లో వివాహం ఒక సామాజిక, ఆర్థిక బాధ్యత అని, వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగానే పథకాలను అమలు చేస్తున్నామని తెలిపింది.
కోర్టు ఆదేశాల గడువు వరకు.. ఆ తర్వాత?
ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన చర్యలపై దృష్టి పెట్టింది. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి పథకాల కొనసాగింపునకు అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కల్యాణ లక్ష్మి, శాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కీలకమైన సంక్షేమ కార్యక్రమాలని, వాటిని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
