ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు పాదయాత్ర

ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువల్లో వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్‌
రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి..
ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆరోపణ

వరంగల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాదయాత్ర చేపట్టారు. వరంగల్‌ జిల్లా మైలారం నుంచి పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువల వెంట ఆయన పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా కాలువల పరిస్థితిని పరిశీలించిన ఎర్రబెల్లి.. రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీంతో రైతులు అప్పుల భారంలో కూరుకుపోతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఎర్రబెల్లి హెచ్చరించారు. పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.