Irumudi | ‘మల్లెపూల పల్లకి’పై అసలు చర్చ ఇదే!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ‘ఇరుముడి’ నుంచి విడుదలైన ‘మల్లెపూల పల్లకి’ పాటపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. అయ్యప్ప భక్తుల్లో చాలాకాలంగా వినిపిస్తున్న ఈ పాటను ఇరుముడి సినిమాలో రీక్రియేట్ చేస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి ఈ సినిమా, అలాగే పాటపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. నిన్నపాట విడుదలయ్యాక కొందరు కొత్త వెర్షన్ బాగుందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఒరిజినల్ వెర్షన్ ఫిల్ లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒకే పాట.. ఒకే తరహా స్వరం అనిపించినా ఎందుకీ తేడా? ఇక్కడే అసలు మ్యూజిక్ స్టోరీ మొదలవుతుంది.
‘మల్లెపూల పల్లకి’కి ఎందుకంత క్రేజ్?
‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ అనే భక్తి పాట తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భజనలు, పడిపూజల్లో చాలాకాలంగా వినిపిస్తూ వస్తోంది. ఈ పాటకు ఇప్పటికే పలు రికార్డెడ్ వెర్షన్లు ఉన్నాయి. అందుకే “ఒరిజినల్ సింగర్ ఒక్కరే.. ఒరిజినల్ వెర్షన్ ఒక్కటే” అని చెప్పడం కంటే, ప్రజల్లో బలంగా స్థిరపడిన పాత వెర్షన్లు ఉన్నాయని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా డప్పు శ్రీను పడిన పాట అద్బుతమైన ప్రజాధారణ పొందింది. ఈ పాటనే సినిమాలో ఉంటుందని టీమ్ ప్రకటించింది.
ఇదే ‘ఇరుముడి’ సినిమా టీమ్‌కు కూడా పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఇది కొత్తగా రాసిన పాట కాదు. ఇప్పటికే వేలాది మంది భక్తులకు పరిచయం ఉన్న పాట. సినిమాలోకి తీసుకొస్తున్నారని తెలిసినప్పటి నుంచే భారీ అంచనాలు. రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’లో ‘మల్లెపూల పల్లకి’ని ఉపయోగిస్తున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ముందుగానే ప్రకటించారు. అయ్యప్ప భక్తుల నుంచి ఈ పాటను సినిమాలో పెట్టాలనే డిమాండ్ కూడా వచ్చినట్టు మూవీ టీమ్ ప్రకటించిన సందర్బాలు ఉన్నాయి.
అక్కడి నుంచే సమస్య మొదలైంది..
ప్రేక్షకులు కొత్త పాట కోసం ఎదురుచూడలేదు.. తమకు తెలిసిన ‘మల్లెపూల పల్లకి’ని కొత్తగా ఎలా చూపిస్తారో చూడాలని ఎదురుచూశారు. ఇది రెండింటి మధ్య చాలా పెద్ద తేడా. మరి ఒకే స్వరం అయినా తేడా ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ గాయకుడి స్వరం ఒక్కటే ప్రమాణం కాదు. ఒక పాట మన చెవికి ఎలా అనిపించాలన్నది కనీసం ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
స్వరం → అరేంజ్‌మెంట్ → వాయిద్యాలు → రికార్డింగ్/మిక్సింగ్ → మాస్టరింగ్
ఇవన్నీ కలిసిన తర్వాతే మనకు చివరగా వినిపించే పాట తయారవుతుంది. అంటే ఒకే వ్యక్తి అదే పల్లవిని పాడినా.. దాని వెనుక ఉన్న సంగీత ప్రపంచాన్ని మార్చేస్తే మనకు వినిపించే అనుభూతి పూర్తిగా మారిపోవచ్చు.
పాత వెర్షన్‌లో ఉన్నఫిల్ ఎందుకు మిస్..
ఇదే ప్రస్తుతం వస్తున్న విమర్శల్లో ప్రధానమైన పాయింట్. పాత భక్తి పాటలను చాలామంది స్టూడియో మ్యూజిక్‌గా కాకుండా ఒక భజన అనుభవంగా గుర్తుపెట్టుకున్నారు. డప్పు, తాళాలు, కోరస్, గుంపుగా పాడే ఫీల్.. ఇవన్నీ కలిసి పాటకు ఒక సహజమైన ఎనర్జీని ఇచ్చాయి. అందుకే పాత వెర్షన్ విన్నప్పుడు “పాట వింటున్నాం” అనే ఫీలింగ్ కంటే “భజనలో ఉన్నాం” అనే ఫీలింగ్ రావచ్చు.
సినిమా కోసం అదే పాటను కాస్తా పాలిష్ చేసి తీసుకొస్తే ఆ ఒరిజినల్ ఫిల్ కొంత తగ్గినట్టు అనిపించే అవకాశం ఉంటుంది. ఇది తప్పనిసరిగా గాయకుడి తప్పు కాదు.
అసలు తేడా ఎక్కడ?
ఇదే ఈ పాటపై చర్చకు అసలు కేంద్రబిందువు. ఒక భక్తి పాటను సినిమాలోకి తీసుకొస్తున్నప్పుడు దానికి సినిమాకు తగ్గట్టుగా చిత్రీకరించాల్సి ఉంటుంది. తెరపై హీరో, భారీ విజువల్స్ ఉండాలి, డ్యాన్స్ లేదా మాస్ మూమెంట్స్‌కు సరిపోవాలి. అందుకే మ్యూజిక్ అరేంజ్‌మెంట్ కూడా ఆ అవసరాలకు అనుగుణంగా మారుతుంది. దాంతో పాత పాటలోని సహజమైన భక్తి ఎనర్జీకి బదులుగా కొత్త వెర్షన్‌లో సినిమాకు తగ్గట్టుగా మార్చినట్లు ఎక్కువగా వినిపించవచ్చు. అది కొందరికి నచ్చుతుంది. మరికొందరికి పాత వెర్షన్ బాగుంది కాదా అనిపిస్తుంది.
ఒక పాటను మనం ఎన్నో సంవత్సరాలు ఒకే తరహాలో వింటే.. మన మెదడు దానిలోని అందులోని విషయాలను మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది. అదే పాటను కొత్త మార్చి విన్నప్పుడు కొత్త వెర్షన్ బాగున్నా కూడా.. ఎక్కడో ఫిల్ మిస్ అయ్యిందే అనే భావన కలుగుతుంది. “పాట బాగుందా? బాగోలేదా?” కాదు. “మనకు తెలిసిన ‘మల్లెపూల పల్లకి’ని సినిమా తన భాషలో ఎంతవరకు మార్చింది? అనేదే. ‘మల్లెపూల పల్లకి’లాంటి పాటను కొత్తగా చేయడం అంటే కొత్త పాట చేయడం కంటే కష్టం. కొత్త పాటకు ప్రేక్షకుడు ఏదైనా కొత్తదాన్ని అంగీకరిస్తాడు. కానీ ఇప్పటికే ప్రజల హృదయంలో ఉన్న పాటను మార్చితే వెంటనే పోలిక మొదలవుతుంది.
ఇప్పటికే ‘ఇరుముడి’లో ‘ఇరుముడి కట్టు’తో పాటు ‘మల్లెపూల పల్లకి’ వంటి భక్తి గీతాలు కీలకంగా ఉంటాయని మేకర్స్ నుంచి ప్రచారం జరిగింది. అందుకే పాటను కేవలం ఆడియో విని తుది తీర్పు ఇవ్వడం కంటే.. సినిమాలో దాని ప్రాధాన్యత, వచ్చే సమయం బట్టి ఎలా ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
‘మల్లెపూల పల్లకి’ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఒక పాటను మనం ఎలా అనుభవిస్తామన్నది గాయకుడి గొంతుతో పాటు అరేంజ్‌మెంట్, వాయిద్యాలు, రిథమ్, సౌండ్ డిజైన్, మిక్సింగ్, మాస్టరింగ్.. అన్నింటి కలయిక. అదే సమయంలో.. ఈ పాటను సంవత్సరాలుగా భక్తి వాతావరణంలో విన్న ప్రేక్షకులకు పాత వెర్షన్‌తో పోల్చకుండా ఉండటం కూడా కష్టం. అందుకే ప్రస్తుతం వస్తున్న డివైడ్ టాక్‌కు అసలు కారణం ఒక్కటే కాదు. పాట మారింది కంటే.. పాటను మనం వినే విధానం మారింది అనడం కరెక్ట్.

