ఆటో కార్మికులకు గుడ్ న్యూస్ : మంత్రి పొన్నం ప్రభాకర్
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
14 ఏళ్లుగా పెరగని ఆటో చార్జీలు..
పెట్రోల్, డీజిల్ ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటాం
ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీల పెంపుపై నిర్ణయం..
ఎలక్ట్రిక్ ఆటోలపై ఆర్టీసీకి ఎలాంటి ప్రతిపాదన లేదు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు సాయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆటో కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి నివాసంలో తెలంగాణ కేకేసీ యూనియన్ ప్రతినిధులు ఆయనను కలిసి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వెల్లడించారు.
త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు
ఆటో కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఉపాధికి భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆటో కార్మికులకు మరింత మేలు చేసేలా త్వరలోనే శుభవార్త చెబుతామని, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
14 ఏళ్లుగా ఛార్జీల పెంపు లేదు
ఆటో ఛార్జీలను పెంచాలని కార్మిక సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయని మంత్రి తెలిపారు. చివరిసారిగా 2012లో ఆటో ఛార్జీలు పెరిగాయని, అప్పటి నుంచి దాదాపు 14 ఏళ్లుగా ఛార్జీల పెంపు జరగలేదని పేర్కొన్నారు. ఈ కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఆటోల కొనుగోలు ధరలు, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయని అన్నారు. ఆటో కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. అయితే ఛార్జీలు పెంచితే ఆ భారం నేరుగా ప్రయాణికులపై పడే అవకాశం ఉన్నందున అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. కార్మికుల ప్రయోజనాలతో పాటు ప్రయాణికులపై పడే భారాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటామని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ ఆటోలపై ఆర్టీసీకి ప్రతిపాదన లేదు
ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి నడపబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఆర్టీసీకి ఎలాంటి ఆలోచన లేదని తెలిపారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయదని స్పష్టం చేస్తూ.. ఆటో కార్మికుల ఉపాధికి ప్రభుత్వం పూర్తి రక్షణగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇంటి నుంచి గమ్యస్థానం వరకు రవాణా
ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో భాగంగా చివరి మైలు అనుసంధానాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆర్టీసీ, రైల్వేలు, మెట్రో రైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను సమన్వయం చేసి ప్రయాణికులు ఇంటి నుంచి తమ గమ్యస్థానానికి సౌకర్యవంతంగా చేరుకునేలా సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
పాత ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చుకునేందుకు సాయం
ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను ప్రత్యేక మార్పిడి ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే వారికి ఆర్థిక సహాయం అందించే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో ఆటోకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యతో ఆటో కార్మికులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చులు, వాహనాల నిర్వహణ వ్యయాల విషయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆటో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి ఉపాధికి పూర్తి రక్షణ కల్పించడంతో పాటు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు.
