మండల స్థాయిలో తొలిరోజు ప్రజావాణి..
తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపించే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం తొర్రూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైంది. తొలిరోజు ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, వ్యవసాయ శాఖ అధికారి రాంనర్సయ్య ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు నేరుగా వివరించే అవకాశం కల్పించడంతో ప్రజావాణికి మంచి స్పందన లభించింది.
వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
