మాజీ మంత్రి హరీశ్‌రావు విమ‌ర్శ‌లు

సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభంపై మాజీ మంత్రి విమర్శలు..
పూర్తి వైద్య సేవలు అందుబాటులోకి తేకుండానే ప్రారంభిస్తున్నారని ఆరోపణ
మూడు టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణం బీఆర్‌ఎస్‌ హయాంలోనే ప్రారంభమైందన్న హరీశ్‌రావు
పేదలకు ఉచిత కార్పొరేట్‌ వైద్యం లక్ష్యంగా టిమ్స్‌ రూపకల్పన చేశామని వెల్లడి..
నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్‌

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సనత్‌నగర్‌ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ప్రారంభం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టిమ్స్‌ ఆలోచన, ప్రణాళిక, నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అయితే ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ప్రస్తుత ప్రభుత్వం క్రెడిట్‌ తీసుకుంటోందని విమర్శించారు.

‘‘ఆలోచన కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది’’

కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి ప్రచారం చేసుకున్నట్లుగానే, కేసీఆర్‌ ప్రారంభించిన టిమ్స్‌ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ప్రారంభ తేదీలు పలుమార్లు మారినా, ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడం విచారకరమని అన్నారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకు మాత్రమే పరిమితం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు.

మూడు టిమ్స్‌లకు రూ.2,679 కోట్ల మంజూరు

హైదరాబాద్‌ నగరానికి మూడు వైపులా అల్వాల్‌, సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌లో టిమ్స్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని హరీశ్‌రావు తెలిపారు. కరోనా అనంతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో టిమ్స్‌లకు రూపకల్పన చేశామని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌ 26న ఒకేరోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపనలు చేశామని, ఒక్కో ఆసుపత్రిని వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించేందుకు రూ.2,679 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

నిర్మాణాల్లో జాప్యంపై విమర్శలు

బీఆర్‌ఎస్‌ హయాంలో టిమ్స్‌ నిర్మాణ పనులు వేగంగా సాగాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నెమ్మదించాయని హరీశ్‌రావు ఆరోపించారు. తేదీలు మారాయి తప్ప ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తికాలేదని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని అన్నారు. సనత్‌నగర్‌ టిమ్స్‌లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండానే ప్రారంభిస్తున్నారని, కనీస మౌలిక వసతుల విషయంలోనూ లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

ఉచిత వైద్యంపై ప్రశ్నలు

పేదలకు పూర్తిగా ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు అందించాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆసుపత్రుల్లో రుసుముల విధానంపై దృష్టి పెట్టడం సరికాదని విమర్శించారు. ప్రచారంపై ఉన్న శ్రద్ధ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడంపై చూపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.

వరంగల్‌ హెల్త్‌ సిటీ, నిమ్స్‌ విస్తరణ పూర్తి చేయాలి

టిమ్స్‌ ఆసుపత్రులతో పాటు వరంగల్‌ హెల్త్‌ సిటీ, హైదరాబాద్‌లో నిమ్స్‌ 2 వేల పడకల కొత్త బ్లాక్‌ నిర్మాణాలను కూడా త్వరగా పూర్తి చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి రాజకీయ కారణాలే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రులు ఇంకా నిర్మాణ దశలో ఉండటం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు.

‘‘ఆదాయ వనరులుగా మార్చొద్దు’’

పేదలకు అత్యున్నత వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆసుపత్రులను ఆదాయ వనరులుగా మార్చవద్దని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. టిమ్స్‌, వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్‌ విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని బీఆర్‌ఎస్‌ తరఫున డిమాండ్‌ చేశారు.