నేడు సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం
సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ప్రారంభోత్సవం..
తెలంగాణ వైద్య రంగంలో మరో చారిత్రక అడుగు..
అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు కొత్త కేంద్రంగా సనత్‌నగర్ టిమ్స్
పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం..
ప్రభుత్వ వైద్య మౌలిక వసతుల్లో కీలక ముందడుగు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రజారోగ్య రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సనత్‌నగర్‌లో నిర్మించిన డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా. ఎంసీఆర్ టిమ్స్) ఆసుపత్రి నేడు ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సాయంత్రం 4.30 గంటలకు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఆసుపత్రి కీలకంగా మారనుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.
అధునాతన వైద్యానికి కొత్త గమ్యస్థానం
సనత్‌నగర్ టిమ్స్ ద్వారా వివిధ రకాల అత్యున్నత వైద్య సేవలను ఒకేచోట అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంక్లిష్టమైన అనారోగ్య సమస్యలకు సూపర్ స్పెషాలిటీ చికిత్సలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక వ్యయంతో లభించే వైద్య సేవలకు ప్రత్యామ్నాయంగా నాణ్యమైన ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో టిమ్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.
ప్రజారోగ్య మౌలిక వసతుల్లో కీలక అడుగు
హైదరాబాద్‌లో అధునాతన వైద్య సేవలపై పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని సనత్‌నగర్ టిమ్స్ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంది. నగర ప్రజలతో పాటు జిల్లాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్‌కు వచ్చే రోగులకు కూడా ఈ ఆసుపత్రి ఉపయోగపడే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థలో సనత్‌నగర్ టిమ్స్ ఒక కీలక సంస్థగా నిలవనుందని అధికారులు పేర్కొంటున్నారు. అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు కొత్త కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర వైద్య రంగంలో ఇది మరో ముఖ్యమైన మైలురాయిగా మారనుంది.
