3 దరఖాస్తులకు.. 30 మంది అధికారులా?

  • ప్రజావాణికి స్వల్ప స్పందన.. వైద్యాధికారుల హాజరుపై అభ్యంతరాలు

కోదాడ అర్బన్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమానికి మండల ప్రజల నుంచి మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి. వివిధ శాఖలకు సంబంధించిన సుమారు 30 మంది అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ప్రజల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో మూడు గంటల పాటు నిర్వహించిన కార్యక్రమానికి స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది.

వైద్యాధికారులకు మినహాయింపు ఇవ్వాలని రోగులు కోరుతున్నారు. వైద్యాధికారులు కూడా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనడంతో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వైద్యాధికారులను అత్యవసర సేవల కింద గుర్తించి ప్రజావాణి కార్యక్రమానికి మినహాయింపు ఇవ్వాలని, ఆసుపత్రుల్లో వారు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. మండల స్థాయిలో నిర్వహించిన తొలి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.