‘ఇండియాస్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డు’కు వాల్గోట్‌ కిషన్‌

కడెం, ఆంధ్రప్రభ : శివ నాడార్ ఫౌండేషన్, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అందించే ‘ఇండియాస్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డు–2026’కు నిర్మల్‌ జిల్లా కడెం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు వాల్గోట్‌ కిషన్‌ ఎంపికయ్యారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 40 మంది, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 40 మంది ఉపాధ్యాయులను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఎంపికైన 80 మంది ఉపాధ్యాయుల్లో 16 మందికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో వారం రోజులపాటు విద్యాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మిగతా 64 మంది ఉపాధ్యాయులకు ఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను అందజేయనున్నారు. గత 28 సంవత్సరాలుగా వాల్గోట్‌ కిషన్‌ నిర్వహిస్తున్న విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన నిర్మల్‌ జిల్లా కడెం మండలం లింగాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.