ఆర్టీసీలో అప్రెంటిస్ అవకాశాలు
- అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 11న ప్రత్యక్ష ఇంటర్వ్యూ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీజీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ పరిధిలో అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ తెలిపారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 13 ఖాళీలు, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెకానికల్, ఆటోమొబైల్ తదితర సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
2022 నుంచి 2026 మధ్య ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశం ఉంటుందని, 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని సూచించారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు మొదటి సంవత్సరం నెలకు రూ.18 వేలు, రెండో సంవత్సరం రూ.20 వేలు, మూడో సంవత్సరం రూ.22 వేల చొప్పున స్టైపెండ్ అందించనున్నారు. డిప్లొమా అభ్యర్థులకు వరుసగా రూ.16 వేలు, రూ.17,500, రూ.19 వేల చొప్పున చెల్లిస్తారు. నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు కూడా ఇదే స్థాయిలో స్టైపెండ్ అందజేయనున్నట్లు తెలిపారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 11న ఉదయం 10 గంటలకు రంగారెడ్డి రీజియన్ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యక్ష ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఎన్‌ఏటీఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలను తీసుకురావాలని తెలిపారు.
