యూజీసీ నెట్ రీఎగ్జామ్..
ఆంధ్రప్రభ : యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పేపర్లలో ప్రశ్నలు, అనువాదం, వ్యాకరణం, టైపింగ్ తదితర అంశాల్లో అనేక తప్పులు ఉన్నాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ప్రశ్నపత్రాలను పరిశీలించింది. అనంతరం ఈ మూడు సబ్జెక్టులకు రీ-ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్టీఏ ప్రకటించింది.
సెప్టెంబర్ 9, 10న రీ-ఎగ్జామ్
సెప్టెంబర్ 9:
ఇంగ్లిష్ – ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
కామర్స్ – మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
సెప్టెంబర్ 10:
సోషియాలజీ – ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
ప్రశ్నపత్రాల్లో పలు తప్పులు
ఈ ఏడాది జూన్ 22 నుంచి 30 వరకు 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు, వ్యక్తుల పేర్లు, పుస్తకాల పేర్లు, అనువాదం, వ్యాకరణం, టైపింగ్ వంటి అంశాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ప్రశ్నలు గతంలో అడిగినవే ఉన్నట్లు కూడా పరిశీలనలో తేలింది. తప్పుగా ఉన్న ప్రశ్నలను తొలగించడం లేదా ఇతర మార్గాల్లో సర్దుబాటు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. దీంతో అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మొత్తం పరీక్షను మరోసారి నిర్వహించాలని నిర్ణయించారు.
అదనపు ఫీజు లేదు
రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థుల నుంచి ఎలాంటి అదనపు పరీక్ష రుసుము వసూలు చేయరు. పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డులకు సంబంధించిన వివరాలను ఎన్టీఏ త్వరలో ప్రకటించనుంది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలను షెడ్యూల్ ప్రకారమే విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. ఈ రీ-ఎగ్జామ్ కారణంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశ ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం ఉండదని స్పష్టం చేసింది.
