American Airlines | ఒకే నంబర్‌తో రెండు విమానాలు…

ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం..


American Airlines | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌ ప్రాంతంలో రెండు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు గాల్లో ఒకే మార్గంలోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకే ఫ్లైట్‌ నంబర్‌ ఉండటంతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చినప్పటికీ.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఫీనిక్స్‌ స్కైహార్బర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షికాగో నుంచి వస్తున్న బోయింగ్‌ విమానం, ఫీనిక్స్‌ నుంచి బయల్దేరిన మరో విమానం దాదాపు ఒకే మార్గంలోకి వచ్చాయి. ఈ రెండు విమానాలకు అమెరికన్‌ 2482 అనే ఒకే ఫ్లైట్‌ నంబర్‌ ఉండటం, ప్రతికూల వాతావరణం కారణంగా షికాగో విమానం ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే విమానాలకు ఒకే ఫ్లైట్‌ నంబర్‌ కేటాయించడం జరుగుతుంది. అయితే ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ఒకే నంబర్‌తో ఉన్న రెండు విమానాలు రావడం అరుదైన ఘటనగా అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రమాదకర పరిస్థితిని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ గుర్తించి వెంటనే పైలట్లకు సూచనలు ఇచ్చారు. షికాగో నుంచి వస్తున్న విమానాన్ని ఎక్కువ ఎత్తులోకి వెళ్లాలని, ఫీనిక్స్‌ నుంచి బయల్దేరిన విమానాన్ని తక్కువ ఎత్తులో ప్రయాణించాలని ఆదేశించారు. పైలట్లు సూచనలు పాటించడంతో ఢీకొనే ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ పేర్కొన్నారు. భద్రతా లోపాలకు కారణాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.