టీజీ20 ఛాంపియన్స్ గా “హైదరాబాద్ ఈ ఛాంపియన్స్”

  • ఖమ్మం ఏసెస్‌పై ఆరు వికెట్ల విజయం..
  • ఉప్పల్‌లో ఘనంగా ట్రోఫీ ముద్దాడిన హైదరాబాద్

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ క్రికెట్ అభిమానులను అలరించిన టీజీ20-2026 టోర్నీలో హైదరాబాద్-ఈ ఛాంపియన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్-ఈ ఛాంపియన్స్, ఖమ్మం జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులకు పరిమితం చేసింది. ఖమ్మం తరఫున మిక్కిల్ జైస్వాల్ 39 బంతుల్లో 65 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. కొడిమెల హిమతేజ 31, విద్యానంద రెడ్డి అజేయంగా 20 పరుగులు చేశారు.

హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా… దేవ్ మెహతా, అజయ్ దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు సాధించి ఖమ్మం జట్టును కట్టడి చేశారు.

ఇక‌, 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్-ఈ ఛాంపియన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ అభిరత్ రెడ్డి 30 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. శణ్ముఖ అశ్విన్ 21 బంతుల్లో 36 పరుగులతో మెరిశాడు. చివర్లో వైష్ణవ్ రెడ్డి అజేయంగా 41 పరుగులు, ప్రణవ్ వర్మ అజేయంగా 19 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 17.4 ఓవర్లలో 158/4 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి టీజీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఖమ్మం బౌలర్లలో హర్షిత్ సాయి, విద్యానంద రెడ్డి, వేద్ రెడ్డి, షేక్ అజర్ తలో వికెట్ సాధించినా జట్టును విజయపథంలో నడిపించలేకపోయారు.

విజేతలకు భారీ ప్రైజ్‌మనీ

మ్యాచ్ అనంత‌రం.. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా టోర్నమెంట్ విజేత అయిన ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ జట్టుకు రూ.1 కోటి నగదు బహుమతిని, రన్నరప్ గా నిలిచిన ‘అన్విత ఖమ్మం ఏసెస్’ జట్టుకు రూ.50 లక్షల బహుమతిని అందజేశారు. అలాగే, మూడవ, నాలుగవ స్థానాల్లో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించి, అందజేశారు.

టీ20 ఫైనల్‌లో మెరుపులు విరజిమ్మిన లేజర్ షో

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో TG20 లీగ్ ఫైనల్ సందర్భంగా అభిమానులను కట్టిపడేసేలా అద్భుతమైన లేజర్ షో నిర్వహించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం అంతా రంగురంగుల లేజర్ లైట్లు, ఆకర్షణీయమైన తాకేలా వచ్చిన బాణసంచా వెలుగులతో కళకళలాడింది. వేలాది మంది అభిమానులు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధిస్తూ సందడి చేశారు. క్రీడా స్ఫూర్తిని రెట్టింపు చేసేలా సాగిన ఈ లేజర్ షో ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.