భారత్‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు…

  • మృతదేహాల తరలింపుపై కేంద్రం ప్రత్యేక చర్యలు..

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు తెలుగు ప్రయాణికులు ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. స్వదేశానికి సురక్షితంగా చేరుకున్న వారిని కుటుంబ సభ్యులు భావోద్వేగంగా ఆహ్వానించారు. ప్రమాదం నుంచి బయటపడి క్షేమంగా తిరిగి రావడంతో వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

వియత్నాంలో జరిగిన ఈ విషాద ఘటనలో పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు చిక్కుకోగా, వారిలో కొందరు సురక్షితంగా బయటపడ్డారు. వారిని కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో స్వదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హిందూపురానికి చెందిన రవితేజ, కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయలక్ష్మి మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. అవసరమైన అన్ని అనుమతులు, అధికారిక ప్రక్రియలను పూర్తి చేసి వీలైనంత త్వరగా మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తెలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, ప్రాణాలతో బయటపడిన వారు స్వదేశానికి చేరుకోవడం కొంత ఊరటనిచ్చింది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వియత్నాం ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన అనుమతులు లభించిన వెంటనే మృతదేహాలను హనోయికి తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నాటికి డాక్యుమెంటేషన్, ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన ప్రక్రియలు పూర్తవుతాయని, అనంతరం మృతదేహాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మృతదేహాల అప్పగింత ప్రక్రియ సజావుగా సాగేందుకు కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ‘ఈ-కేర్’ పోర్టల్‌లో స్వీకరించే వ్యక్తి పేరు, మొబైల్ నంబర్, ప్రభుత్వ గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేయాలని కేంద్ర మంత్రి కోరారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.