పిల్లలు పుట్టలేదని..
- భర్త, అత్తమామలపై కేసు నమోదు..
- ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఆంధ్రప్రభ, జన్నారం : పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో వివాహితను సంవత్సరాల పాటు వేధింపులకు గురిచేసిన ఘటన విషాదాంతమైంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామంలో 29 ఏళ్ల మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన పరకాల లక్ష్మి, రాజగౌడ్ దంపతుల కుమార్తె పంజాల మౌనిక (29)కు 2012లో చింతలపల్లి గ్రామానికి చెందిన పంజాల రవిగౌడ్ తో వివాహం జరిగింది. వివాహానంతరం పిల్లలు కలగకపోవడంతో.. గత 12 సంవత్సరాలుగా భర్తతో పాటు అత్తమామలు రాజవ్వ, రాజగౌడ్ ఆమెను తరచూ వేధింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండో వివాహం చేసుకుంటానంటూ భర్త బెదిరించేవాడని, ఇదే అంశంపై తరచూ మానసికంగా, శారీరకంగా హింసించేవారని తెలిపారు.
ఆదివారం సాయంత్రం మౌనిక ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి లక్ష్మి, బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మరణానికి భర్త, అత్తమామల వేధింపులే కారణమని ఆరోపించారు.
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రవిగౌడ్, అత్త రాజవ్వ, మామ రాజగౌడ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని లక్షేటిపేట సీఐ రమణమూర్తి పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
