ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు కష్టాలు: ఏలేటి, ఈటల

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు కష్టాలు: ఏలేటి, ఈటల
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రైతులు పడుతున్న కష్టాలను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం నిర్మల్ జిల్లాలోని మామడ, సారంగాపూర్, దిలావర్‌పూర్, కడెం మండలాల్లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా బస్సు యాత్రలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మామడ కేంద్రంతో పాటు పొన్కల్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన నాయకులకు రైతులు తమ ఇబ్బందులను వివరించారు. లారీలు, గోనె సంచుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండి లారీలు, సంచుల కోసం ఎదురు చూస్తున్నామని, తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లు సంచికి రూ.15 వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
