శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..

  • రియాద్-హైదరాబాద్ విమానంపై ఫేక్ ఈ-మెయిల్
  • ల్యాండింగ్ అనంతరం క్షుణ్ణంగా తనిఖీలు..

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)కు ఆదివారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ అంతర్జాతీయ విమానాన్ని గగనతలంలోనే పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ వార్నింగ్ వ‌చ్చింది. దీంతో భద్రతా సంస్థలు అత్యవసర చర్యలు చేపట్టాయి.

విమానాశ్రయం కస్టమర్ సపోర్ట్‌కు ఈ-మెయిల్ అందిన వెంటనే అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సంబంధిత విమానం శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం బాంబ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్, భద్రతా సిబ్బంది విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. ప్రయాణికుల సామానుతో పాటు విమానంలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది ఫేక్ బాంబు బెదిరింపుగా అధికారులు నిర్ధారించారు. దీంతో అధికారులు, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) అధికారులు ఫిర్యాదు చేయడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.