మోత్కూర్‌లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి

మోత్కూర్‌లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కృషి

  • హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు వినతిపత్రం అందజేత
  • నాలుగు మండలాల ప్రజలకు అందుబాటులో న్యాయసేవల లక్ష్యం

మోత్కూర్, ఆంధ్రప్రభ:
మోత్కూర్‌లో జూనియర్ సివిల్ జడ్జి (మున్సిఫ్) కోర్టు ఏర్పాటు కోసం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను బుధవారం ఎమ్మెల్యే మందుల సామేల్ స్వయంగా కలిసి మోత్కూర్‌లో కోర్టు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ, మోత్కూర్, ఆత్మకూరు (ఎం), అడ్డగుడూరు, గుండాల మండలాల ప్రజలు కోర్టు పనుల కోసం భువనగిరి, ఆలేరు, రామన్నపేట కోర్టులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. మోత్కూర్‌లో కోర్టు ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

మోత్కూర్, అడ్డగుడూరు, ఆత్మకూరు, గుండాల మండలాలకు సంబంధించిన సుమారు 1,800 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, సాధారణంగా 600 కేసులు ఉంటేనే కొత్త కోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.మోత్కూర్ గతంలో తాలూకా, సమితి కేంద్రంగా పనిచేసిందని గుర్తు చేశారు. ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల నాలుగు మండలాల ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువ కావడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే మోత్కూర్‌లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు జరుగుతుందనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యక్తం చేశారు.