రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరం..

రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరం..

  • అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. వర్షాకాలం ముగిసి యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతు భరోసా (రైతు బంధు) ఇప్పటికీ విడుదల కాలేదని, దీనివల్ల రైతులు భూములు సిద్ధం చేయడం, విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు వేసుకోవడం వంటి వ్యవసాయ పనుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని సంఘం పేర్కొంది.

ప్రతి సీజన్‌కు సంబంధించిన ఆర్థిక సహాయం సకాలంలో అందకపోవడం రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) ప్రస్తుత మార్కెట్లో అమలు కావడం లేదని సంఘం విమర్శించింది. ముఖ్యంగా మొక్కజొన్నకు రూ.2,400 MSP ప్రకటించినప్పటికీ మార్కెట్లో రూ.1,600 నుండి రూ.1,700 వరకు మాత్రమే ధర లభిస్తున్నదని, దీని వల్ల రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపింది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మార్క్‌ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయమైన ధరలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయడంతో పాటు MSP అమలు విషయంలో కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రామచందర్.పి . కొండారెడ్డి, జిల్లా అధ్యక్షులు కోళ్ల అంజన్న జిల్లా కమిటీ సభ్యులు నరసింహ జిల్లా కార్యదర్శి సాంబశివుడు బాలు ఉషనప్ప గణేష్ తిరుపతయ్య ఉన్నారు