మినీ ట్యాంక్‌బండ్‌లుగా చెరువుల అభివృద్ధి

మినీ ట్యాంక్‌బండ్‌లుగా చెరువుల అభివృద్ధి

దేవసముద్రం, పోతుల చెరువుల పనులకు రూ.2.40 కోట్లు మంజూరు

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా దేవసముద్రం, పోతుల చెరువుల ఆధునీకరణ, సుందరీకరణ పనుల కోసం రూ.2.40 కోట్ల నిధులు మంజూరుకావడంతో పట్టణ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఈ నిధుల మంజూరుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మంజూరైన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. దేవసముద్రం, పోతుల చెరువులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సైకిల్‌పై ప్రయాణిస్తూ చెరువులను పరిశీలించారు.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవసముద్రం చెరువును ఆధునిక హంగులతో అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మునుకుళ్ల రోడ్డులోని పోతుల చెరువును కూడా సుందరీకరించి పట్టణ సౌందర్యాన్ని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువుల కట్టల విస్తరణ, పార్కుల ఏర్పాటు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, విద్యుత్ దీపాలతో అలంకరణ, పచ్చదనం పెంపు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తిరువూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొన్నారు.

తిరువూరు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply