మెగా జాబ్ మేళాతో యువతకు ఉపాధి దారి
- చంద్రగిరిలో భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత
- అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని
- త్వరలో ఐటీ కంపెనీల రాకతో మరిన్ని ఉద్యోగ అవకాశాలు
- యువతకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే
తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తనపల్లిలోని రఘునాథ్ రిసార్ట్స్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. హెచ్ ఫాక్స్‌కాన్ (నాట్స్) సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దెబ్బతిందని, నిరుద్యోగ సమస్య పెరిగిందని విమర్శించారు. పరిశ్రమలను ప్రోత్సహించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగానే ప్రస్తుతం ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల్లో నిర్వహించిన జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా వందలాది మంది యువతకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో ప్రతి ఏడాది మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈసారి అవకాశం పొందని అభ్యర్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, త్వరలో నియోజకవర్గంలో ఐటీ కంపెనీలు రానున్నాయని, వాటి ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ఉద్యోగం సాధించిన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాల్లో భాగస్వాములు కావాలని, ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా అంకితభావంతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. అలాగే పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని సంస్థలు తగిన వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమం అనంతరం మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా నియామక పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
