సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

  • హామీలు అమలు కాకపోతే ఉద్యమం తీవ్రతరం
  • గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ వర్కర్ల హెచ్చరిక
  • 10న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, గతంలో మంత్రులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డైలీ వేజ్ వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో వర్కర్లు తమ సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గతంలో తమ డిమాండ్ల సాధన కోసం 45 రోజుల పాటు సమ్మె నిర్వహించగా, ఆ సమయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ జోక్యంతో జరిగిన చర్చల్లో మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో డైలీ వేజ్ వర్కర్లకు కలెక్టర్ గెజిట్ ప్రకారం నెలకు రూ.26,700 వరకు వేతనాలు చెల్లిస్తుండగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో మాత్రం జీవో నంబర్ 64 ప్రకారం కేవలం రూ.11,700 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

ఒకే శాఖలో ఒకే విధమైన పనులు చేస్తున్న కార్మికులకు వేర్వేరు వేతనాలు చెల్లించడం అన్యాయమని విమర్శించారు. గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్నప్పటికీ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని వాపోయారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పెరిగిన కార్మిక వేతనాలను తమకు కూడా వర్తింపజేయాలని కోరిన వర్కర్లు, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన వేతన విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

మంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అలాగే ఈ నెల 10న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న డైలీ వేజ్ వర్కర్ల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల సురేందర్, రాష్ట్ర నాయకులు దామోదర్, వెంకటేష్, రాంజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి హోం ప్రకాష్, ఉపాధ్యక్షుడు ఎల్లమ్మ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.