స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్రకు కొత్తచెరువు నుంచి శ్రీకారం

  • విద్యార్థులతో కలిసి మానవహారం, స్వచ్ఛత ప్రతిజ్ఞ, శుభ్రత
  • కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్తచెరువులో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కిష్టప్ప, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నెహ్రూ సర్కిల్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్లాస్టిక్ రహిత పుట్టపర్తి నియోజకవర్గం లక్ష్యంగా మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం చీపుర్లు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలోని సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాల అమలుపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల గోడలపై విద్యార్థులతో కలిసి స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే చిత్రాలను గీశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, “స్వచ్ఛత ఒక్కరోజు కార్యక్రమం కాదు. ప్రతి ఇంటి నుంచి, ప్రతి పాఠశాల నుంచి, ప్రతి గ్రామం నుంచి ప్రారంభమయ్యే ప్రజా ఉద్యమం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతను అలవాటుగా మార్చుకుంటేనే స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుంది” అని అన్నారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రమైన గ్రామాలు, పచ్చని వాతావరణం సమాజ ఆరోగ్యానికి ఎంతో అవసరమని, యువత, విద్యార్థులు స్వచ్ఛత ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వలిపి శ్రీనివాసులు, సాలెక్కగారి శ్రీనివాసులు, రామకృష్ణ, కాళహస్తి ఆలయ కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ, కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రకాష్, భాస్కర్, రాజు, సురేష్, సుధాకర్, రమేష్ రెడ్డి, కిష్టప్ప, శివప్రసాద్, హరిప్రసాద్, నాగేంద్ర ప్రసాద్, కూటమి పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.