నగరాభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..
ఖాజీపేట దర్గా ఉర్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ టి. వెంకన్న శనివారం నగరంలో కొనసాగుతున్న, చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ముందుగా హనుమకొండ బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన కమిషనర్, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులను వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం పరిసరాలను సందర్శించి, జేబీఎస్ బస్‌స్టేషన్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని స్టేడియం రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా రహదారి విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు.
హనుమకొండ అశోక్ థియేటర్ ఎదురుగా ప్రతిపాదించిన మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్, టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్టులో నిర్వహించనున్న ఖాజీపేట దర్గా ఉర్స్ ఉత్సవాల నేపథ్యంలో కమిషనర్ వెంకన్న, దర్గా పీఠాధిపతి అఫ్జల్ బియాబానీ ఖుస్రో పాషాతో కలిసి దర్గా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వెలుగులు, రహదారుల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
