పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

  • లాడ్జిలో 16 మంది అదుపులోకి..
  • నగదు, పేకముక్కలు, లెక్కల పుస్తకం స్వాధీనం

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు పట్టణంలోని రవి డీలక్స్ లాడ్జిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో 16 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నగదు, పేకముక్కలు, లెక్కలకు సంబంధించిన పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ చంద్రశేఖర్, పోలీసు సిబ్బందితో కలిసి లాడ్జిపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన పేకాట ఆడుతున్న వారు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దాడి సమయంలో స్థావరం నుంచి నగదు, పేకముక్కలు, లెక్కల పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారి పూర్తి వివరాలు, స్వాధీనం చేసుకున్న నగదు వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

నందికొట్కూరులోని పలు లాడ్జిల్లో గతంలోనూ పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని లాడ్జిలను అడ్డాగా చేసుకుని అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

పట్టణంలోని లాడ్జిల్లో నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లాడ్జిల ముసుగులో నడుస్తున్న అక్రమ పేకాట స్థావరాలపై పోలీసులు నిరంతర నిఘా కొనసాగించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.