విజయ డెయిరీలో అనూహ్య పరిణామం

  • చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా
  • ఏడేళ్ల పదవీకాలం తర్వాత కొత్త నాయకత్వానికి మార్గం
  • పార్టీ నిర్ణయమే అంతిమమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం
  • ఆరోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చలసాని
  • కేఎంవీ ప్లాంట్ భూమి పట్టాల మంజూరుకు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయ డెయిరీలో కీలక రాజకీయ, పరిపాలనా పరిణామం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (విజయ డెయిరీ) చైర్మన్, బోర్డు డైరెక్టర్ చలసాని ఆంజనేయులు తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్‌కు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామం విజయ డెయిరీ ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదే సమయంలో అనారోగ్యంతో విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చలసాని ఆంజనేయులను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, విజయ డెయిరీ చైర్మన్ పదవిపై పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. చలసాని ఆంజనేయులు వరుసగా ఏడేళ్లపాటు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ ముందుగానే పోటీ చేయవద్దని సూచించిందని, పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు గౌరవించడం సంస్థ బలోపేతానికి అవసరమని వ్యాఖ్యానించారు.

రాజీనామా లేఖలో చలసాని ఆంజనేయులు తన పదవీకాలంలో సహకరించిన బోర్డు సభ్యులు, పాల ఉత్పత్తిదారులు, ఉద్యోగులు, సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్, డైరెక్టర్ పదవులకు ఆగస్టు 7 నుంచే రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంటూ, ఏర్పడిన ఖాళీలను సంఘ బైలాలు, ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం–1995 నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని కోరారు.

అదే లేఖలో విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ (కేఎంవీ) ప్లాంట్‌కు భూమి టైటిల్, పట్టాల మంజూరు అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్లాంట్ భూమి సమస్యను పరిష్కరించి పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తన ఆధీనంలో ఉన్న సంఘానికి సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలు, ముద్రలు, ఇతర ఆస్తులను మేనేజింగ్ డైరెక్టర్‌కు అప్పగిస్తున్నట్లు వెల్లడిస్తూ, వాటి స్వీకరణకు అంగీకార రసీదు ఇవ్వాలని కోరారు.

విజయ డెయిరీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయంగా, సహకార రంగంలో చర్చనీయాంశంగా మారాయి. చైర్మన్ పదవికి రాజీనామా, పార్టీ నాయకత్వం కొత్త ముఖానికి అవకాశం కల్పించే సంకేతాలు ఇవ్వడం, మంత్రి పార్థసారథి చేసిన వ్యాఖ్యలు, చలసాని ఆంజనేయులు పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ వైదొలగడం వంటి పరిణామాలు విజయ డెయిరీ ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.