రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్ గేట్ సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
పోలీసుల వివరాల ప్రకారం.. సారపాక మేడే కాలనీకి చెందిన శ్రీరామ్ ఐటీసీ కర్మాగారంలో అంబిక ఫ్యాబ్రిక్ సంస్థ తరఫున మురళి కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. శుక్రవారం బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు శ్రీరామ్ అక్కడికక్కడే మృతిచెందగా, బుల్లెట్ పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై ఎస్సై మెడ్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదాలకు నిలయంగా ఐటీసీ పరిసరాలు
సారపాక బస్టాండ్ నుంచి ఐటీసీ బీపీఎల్ స్కూల్ వరకు ఉన్న జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కనే భారీ లారీలను పార్క్ చేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఐటీసీకి వచ్చే, వెళ్లే లారీల కారణంగానే ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ యాజమాన్యం శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత కొద్ది రోజుల పాటు మాత్రమే హడావుడి చేసి, ఆ తర్వాత పరిస్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇకనైనా లారీల పార్కింగ్‌ను నియంత్రించి, రహదారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, కార్మికులు కోరుతున్నారు.
