వైభవంగా వారాహి నవరాత్రులు ప్రారంభం

  • శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
  • కలశస్థాపన, వారాహి హోమం, ప్రత్యేక అభిషేకాలు
  • వారాహి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ బస్టాండ్ సమీపంలోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస శుద్ధ పాడ్యమిని పురస్కరించుకుని బుధవారం వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

ఉత్సవాల తొలి రోజు ఆలయంలో కలశస్థాపన, మండపారాధన, పంచామృతాభిషేకం, వారాహి హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అనంతరం కొప్పురావూరి జగదీష్ కుమార్ దంపతులు సమర్పించిన చీరతో అమ్మవారిని వారాహి దేవి అలంకారంలో విశేషంగా అలంకరించారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి కొప్పురావూరి జగదీష్ కుమార్, అధ్యక్షుడు గొల్లపూడి పుల్లయ్య, కమిటీ సభ్యులు భారతుల విజయ్ కిరణ్, మానేపల్లి రాజా, వెన్నా పరమేశ్వరరావు, ఆలపాటి జగన్, గొల్లపూడి సత్యనారాయణ, పులపర్తి విజయ్ తదితరులు పాల్గొన్నారు.