జైల్ భరోను విజయవంతం చేయాలి
- క్విట్ ఇండియా స్ఫూర్తితో ‘క్విట్ కార్పొరేట్స్’ నినాదం..
- రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని రైతు సంఘం పిలుపు
ద్వారకాతిరుమల, ఆంధ్రప్రభ: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ‘క్విట్ కార్పొరేట్స్’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆగస్టు 10న ఏలూరులో నిర్వహించనున్న రైతుల జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లిలో జైల్ భరో కార్యక్రమానికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. అమెరికాతో భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల దేశ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, రైతులు మరింత సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే విధంగా సామ్రాజ్యవాద శక్తులకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇది క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చట్టం తీసుకురావాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న ఏలూరులో జరిగే రైతుల జైల్ భరో కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు, పాడి రైతులు పాల్గొన్నారు.
