రైతులకు రాజముద్ర భరోసా..!

కీర్తిరాయునిగూడెంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేత

మైలవరం, ఆంధ్రప్రభ: రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌బుక్స్‌ పంపిణీ ద్వారా రైతులకు సంపూర్ణ భరోసా కల్పిస్తున్నట్లు ఏపీ లైవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దొండపాటి విజయ్‌కుమార్‌ తెలిపారు. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామ సచివాలయంలో గురువారం రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌బుక్స్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. భూ రికార్డుల ప్రక్షాళనతో రైతుల భూ హక్కులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్స్‌ రైతులకు భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ నాయకత్వంలో నియోజకవర్గంలో రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందుతున్నాయని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో పట్టాదారు పాస్‌బుక్స్‌ ముద్రించి అందించారని, ఇది ప్రభుత్వ పత్రాల్లో వ్యక్తిగత ప్రచారానికి నిదర్శనమని విమర్శించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాస్‌బుక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని రైతులకు సూచించారు.

కార్యక్రమంలో మైలవరం మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పోనకళ్ల నవ్యశ్రీ, మాజీ ఎంపీపీ శోభన్‌బాబు, జనసేన మండల అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య, నంబూరి శ్యాంప్రసాద్‌, రెవెన్యూ అధికారులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.