రీల్స్ గొడవ.. భార్య హత్య.. భర్త అరెస్ట్..
గొంతు నులిమి చంపి.. మృతదేహాన్ని గదిలోనే వదిలేసి బిహార్‌కు పరార్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపై దంపతుల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. భార్యను హత్య చేసి బిహార్‌కు పారిపోయిన భర్తను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన ధీరజ్ కుమార్, రీమా కుమారి 10 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని బెంగళూరులోని కుంబళగోడు ప్రాంతంలో నివాసముంటున్నారు. రీమా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతో ధీరజ్ తరచూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జులై 25న ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన ధీరజ్.. చున్నీతో భార్య గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
హత్య అనంతరం మృతదేహాన్ని గదిలోనే వదిలేసి నిందితుడు బిహార్‌కు పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో గాలింపు చేపట్టి, తాజాగా ధీరజ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడిని బెంగళూరుకు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.
