రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి

తిరువూరు, ఆంధ్రప్రభ: మండలంలోని మల్లేల వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశన్పడుకు చెందిన గోదా కేశవరావు (45) కూలిపనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై విస్సన్నపేట మండలం పుట్రేల వెళ్ళి తిరిగి వస్తుండగా, మల్లేలకు చెందిన పీ జమలయ్య అతని ద్విచక్రవాహనం ఎక్కాడు. మల్లేల సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టరును ఢీకొనగా కేశవరావు అక్కడికక్కడే మృతిచెందాడు.

జమలయ్యకు తీవ్ర గాయాలవగా తిరువూరు ప్రభుత్వాసుపత్రికి 108 అంబులెన్సులో తరలించారు. కేశవరావుకు భార్య, ఇరువురు సంతానం. తిరువూరు ఎస్ఐ శాతకర్ణి సంఘటనా స్థలం సందర్శించి కేసు నమోదు చేశారు. కేశవరావు మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.